బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మదనపల్లె కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి అవసరాల అంచనా, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పంచాయతీ, మండలం, మున్సిపాలిటీల వారీగా ఎన్నికల అధికారుల నియామకం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలోని 411 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవని కలెక్టర్ తెలిపారు. పోల్ కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్ స్టేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
కోర్టు కేసుల కారణంగా ప్రభావితమైన పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి అవసరమైన సన్నాహక పనులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు. తదుపరి కోర్టు తీర్పు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలను గుర్తించేందుకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీతో సమావేశాలు నిర్వహించి గతంలో వివాదాలు, గొడవలు జరిగిన ప్రాంతాలతో పాటు ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల నేపథ్యంలో గత ఒకటి రెండు నెలలుగా అసాంఘిక శక్తులపై నిఘా, నియంత్రణ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన అన్ని సూచనలు, మార్గదర్శకాలను నమోదు చేసుకున్నామని, వాటిని నిబంధనల ప్రకారం అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, ఎస్జీఎస్డబ్ల్యూ జిల్లా అధికారి అమర్నాథ్ రెడ్డి, మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు ప్రమీల, రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
