స్పెషల్ టెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ

మదనపల్లె, అక్టోబర్ 9: అన్నమయ్య జిల్లాలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ స్పెషల్ టెట్‌–2026 (ఇన్‌ సర్వీస్ టీచర్స్) పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,616 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో మదనపల్లెలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 240 మంది, రాయచోటిలోని భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో 420 మంది, శ్రీ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో 956 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అలాగే ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అభ్యర్థుల కోసం ఆర్టీసీ వారు సరిపడే బస్సులు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పోలీస్ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించాలని, కేంద్రాలలో మెడికల్ అండ్ హెల్త్ వారు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.

ఈ పరీక్షలకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా మదనపల్లి లోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెంటర్ కు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె. ప్రభాకర్ రెడ్డి,భాస్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల రాయచోటి కు సి.రామకృష్ణుడు, శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు యం. బాలాజీ నాయక్ నియమించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

పరీక్షా కేంద్రాలకు నియమించిన డిపార్ట్‌మెంటల్ అధికారులు ఉదయం 8 గంటలకే విధులకు హాజరుకావాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. అభ్యర్థుల హాల్‌టికెట్లు, గుర్తింపు కార్డులు, ఇతర ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించిన తర్వాతే పరీక్షలకు అనుమతించాలన్నారు. నామినల్ రోల్స్‌లో పేర్లు, తండ్రి పేర్లు, పుట్టిన తేదీలకు సంబంధించిన చిన్నపాటి అక్షర దోషాలను సరైన ఆధారాల ఆధారంగా మాత్రమే సరిచేయాలని, సవరించిన వివరాలను అదే రోజు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని స్పష్టం చేశారు.

దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం స్క్రైబులను, అదనపు సమయాన్ని కల్పించాలని, జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితోనే సహాయకులను కేటాయించాలని తెలిపారు. హాల్‌టికెట్‌పై ఫొటో లేని అభ్యర్థులు ఇటీవలి ఫొటోతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకువస్తేనే నిబంధనల ప్రకారం అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కేంద్రం పేరు, కోడ్‌, పరీక్షల షెడ్యూల్‌ తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు.

ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన నివేదికలు, సవరించిన నామినల్ రోల్స్‌ను నిర్ణీత గడువులోగా సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

పరీక్షలకు సంబంధించిన అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ ను తయారు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయాలని, ఆయా అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని స్పెషల్ టెట్ పరీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా డిఇఓ సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏవో శ్రావణి, మెడికల్, పోలీస్, ఏపీ ఎస్పీడీసీఎల్ , సంబంధిత ఎమ్మార్వోలు,ఎంఈఓ లు,ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *