కడప జిల్లా: సెప్టెంబర్ 4;విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. చెమ్ముమియ్యపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఎం.సి. నాగన్నను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సెప్టెంబర్ 3, 2026న ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థినులతో హెచ్‌ఎం అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ విచారణ చేపట్టింది. మండల విద్యాశాఖ అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా నాగన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (CCA) నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆరోపణలకు సంబంధించి తదుపరి క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో నిబంధనల ప్రకారం ఆయనకు జీవన భృతి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పాఠశాలల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
