మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) ఆధ్వర్యంలో ఉద్యానవన, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన 50 భౌగోళిక సూచీ (GI) ట్యాగ్ల కోసం అధికారికంగా దరఖాస్తులు దాఖలు చేసినట్లు మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి తెలిపారు.
ఇందులో 37 దరఖాస్తులు అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు సంబంధించినవి అని ఆయన తెలిపారు. వీటిలో మదనపల్లె టమాటా, మదనపల్లె చింతపండు, మదనపల్లె నేరేడు పండు, అనంతపురం దానిమ్మ, బత్తాయి, తాడిపత్రి జామ, కడప అరటి, బొప్పాయి, ముల్ల వంకాయ, చిత్తూరు సపోటా, చిత్తూరు టోటాపురి, నీలం, బాదామి మామిడి రకాలు, చిత్తూరు పింక్ జామ, కుప్పం ఉలవలు, రాగి తదితర ఉత్పత్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు ప్రాధాన్యత
మదనపల్లె కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ నేపథ్యంలో ఈ జీఐ దరఖాస్తులకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందని విజయ భాస్కర్ చౌదరి తెలిపారు.
రాయలసీమలో ఉద్యాన ఉత్పత్తుల సాగు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్, ఎగుమతులకు సమగ్ర మౌలిక వసతులు కల్పించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే హార్టికల్చర్ హబ్ ప్రధాన లక్ష్యమని వివరించారు.
ప్రాంతీయంగా ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించడం ద్వారా వాటి భౌగోళిక మూలం, ప్రత్యేక నాణ్యత, ప్రతిష్టను పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ దరఖాస్తులు ఆయా ప్రాంతాల ప్రత్యేక వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా చేపడుతున్న కృషిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
రైతు సంఘాలు, ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యం
మిగిలిన దరఖాస్తులు వివిధ కళాకారులు, ఇతర ఉత్పత్తిదారుల సంస్థలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రక్రియలో ఎం-టమాటో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, శ్రీ చౌడేశ్వరి సిల్క్ సారీస్ సొసైటీ, శ్రీ సాయి చింతపండు సొసైటీ, శ్రీ భూదేవి నేరేడు ఫ్రూట్ సొసైటీ, AFLABT ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, శ్రీ వాసవి ఫుడ్ ప్రొడక్ట్స్ సొసైటీ, ట్రెడిషనల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోటింగ్ సొసైటీ, శ్రీ రామ హార్టికల్చరల్ ప్రొడక్ట్స్ ప్రమోటింగ్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ తదితర సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు.
జీఐ దరఖాస్తుల దాఖలుకు సహకరించిన ప్రొడ్యూసర్ కంపెనీలు, రైతు సంఘాలు, సొసైటీలు, సంబంధిత సంస్థలను ఆయన అభినందించారు. అలాగే మిట్స్-IPFC, మిట్స్ అడ్వైజర్ (ఆర్&డీ) మరియు మిట్స్-IPFC ప్రధాన సమన్వయకర్త డాక్టర్ తులసీరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డీ) డాక్టర్ పి. శివయ్య కృషిని ప్రశంసించారు.
రైతు కేంద్రిత ఆవిష్కరణలు, సంప్రదాయ వ్యవసాయ జ్ఞాన పరిరక్షణ, ప్రాంతీయ వ్యవసాయ ఉత్పత్తులకు మేధోసంపత్తి హక్కుల ద్వారా చట్టబద్ధమైన గుర్తింపు తీసుకురావడంలో మిట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని విజయ భాస్కర్ చౌదరి పేర్కొన్నారు.
