మిట్స్‌లో మూడు రోజుల వెబ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ ప్రారంభం

మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎం.సి.ఏ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న “వెబ్ డెవలప్‌మెంట్” వర్క్‌షాప్ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నైకి చెందిన వి.ఈ.ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్ బి. ఎళిలవన్, సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, టెక్నికల్ ట్రైనర్ నిర్మల్ ఎస్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆధునిక వెబ్ డెవలప్‌మెంట్ సాంకేతికతలపై శిక్షణ అందించే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా టెక్నికల్ ట్రైనర్ నిర్మల్ ఎస్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో వెబ్ డెవలప్‌మెంట్ ఐటీ రంగంలో అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారిందన్నారు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్, డేటాబేస్, సర్వర్ నిర్వహణ వంటి అంశాలపై విద్యార్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

HTML, CSS, JavaScript, React వంటి ఫ్రంట్‌ఎండ్ టెక్నాలజీలతో పాటు Python, Java, Spring Boot, MySQL వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై పట్టు సాధించాలని తెలిపారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, DevOps వంటి ఆధునిక సాంకేతికతలు వెబ్ అప్లికేషన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రోగ్రామింగ్ పరిజ్ఞానంతో పాటు సమస్యల పరిష్కారం, సృజనాత్మక ఆలోచన, టీమ్ వర్క్, ప్రాజెక్ట్ నిర్వహణ వంటి నైపుణ్యాలు కూడా అవసరమని పేర్కొన్నారు.

ప్రాక్టికల్ ప్రాజెక్టులు, లైవ్ అప్లికేషన్లు, రియల్‌టైమ్ వెబ్‌సైట్ల రూపకల్పన ద్వారా పరిశ్రమలకు అవసరమైన అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఈ నైపుణ్యాలతో ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్‌ఎండ్ డెవలపర్, బ్యాక్‌ఎండ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఫ్రీలాన్సింగ్, సొంత స్టార్టప్‌ల స్థాపన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు.

ఈ మూడు రోజుల వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులకు ఆధునిక వెబ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ అందించడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, ఎం.సి.ఏ విభాగాధిపతి డాక్టర్ ఎన్. నవీన్ కుమార్, కోఆర్డినేటర్లు డాక్టర్ ఎస్.వి.ఎస్. గంగాదేవి, డాక్టర్ ఆర్. మారుతముత్తు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *