మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం ఆధ్వర్యంలో ‘ఐమెక్స్ 2.0–2కె26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌ప్లోరేషన్’ అనే అంశంపై ఒకరోజు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన టెక్ మహీంద్రా సంస్థలో ఏఐ/ఎంఎల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న స్నేహిత్ షాప్రపావాడ్ పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ మరియు క్లౌడ్ ఆధారిత ఏఐ సాంకేతికతలు ప్రస్తుత పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై నిరంతరం అవగాహన, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందిచుకోవాలని అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు మరియు నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సింపోజియం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి సాంకేతిక సింపోజియంలు విద్యార్థులకు తరగతి గదుల్లో నేర్చుకున్న విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అన్వేషిస్తూ, వినూత్న పరిష్కారాలను రూపొందించి, తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు . ఈ సింపోజియంలో భాగంగా ఏఐ టెక్ ఎగ్జిబిట్, గ్లిచ్ హంట్, పేపర్ ఎక్స్‌ప్రెస్ మరియు టెక్ క్విజ్ పోటీలను నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మ, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే, ఫ్యాకల్టీ కోర్డినేటర్స్ జి.నితిన్, కె మనోజ్ కుమార్, శాయీజ్ అహమ్మద్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



