మిట్స్ విద్యార్థులకు అమెరికాలో ఒక సెమిస్టర్ చదివే అవకాశంపై చర్చ
మదనపల్లె, అక్టోబర్ 8: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీని అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ (BGSU) అకడమిక్ అఫైర్స్ వైస్ ప్రోవోస్ట్ డాక్టర్ రామ్ వీరపనేని సందర్శించారు.
మిట్స్, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల మధ్య ఇప్పటికే ఉన్న అవగాహన ఒప్పందం (MoU) నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారాన్ని మరింత విస్తరించడంతో పాటు మిట్స్ విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్, అంతర్జాతీయ విద్యా అవకాశాలను పెంపొందించే అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.
అధునాతన ప్రయోగశాలల పరిశీలన
పర్యటనలో భాగంగా డాక్టర్ రామ్ వీరపనేని మిట్స్లో ఇటీవల ఏర్పాటు చేసిన ఆధునిక, అధునాతన ప్రయోగశాలలను సందర్శించారు. వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రయోగశాలలు, పరిశోధనా సదుపాయాలను పరిశీలించారు.
అనంతరం ఇరు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అధ్యాపకుల మార్పిడి, సంయుక్త విద్యా కార్యక్రమాలు, పరిశోధనా సహకారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అమెరికాలో ఒక సెమిస్టర్ చదివే అవకాశం
మిట్స్ విద్యార్థులకు బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ పాటు చదువుకునే అవకాశం కల్పించే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించి ఇరు విశ్వవిద్యాలయాల మధ్య మరింత బలమైన విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరచేందుకు International Exchange Agreement కుదుర్చుకునే అంశంపై కూడా సానుకూలంగా చర్చలు జరిగాయి.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మిట్స్ విద్యార్థులకు అమెరికాలోని విశ్వవిద్యాలయ విద్యా విధానం, పరిశోధనా వాతావరణం, భిన్న సంస్కృతులు, అంతర్జాతీయ విద్యా అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందే అవకాశం లభించనుంది.
అంతర్జాతీయ విద్యా అవకాశాలకు ప్రాధాన్యత
ఈ సందర్భంగా మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీతో మిట్స్కు ఉన్న విద్యా సంబంధాలను మరింత విస్తరించేందుకు డాక్టర్ రామ్ వీరపనేని పర్యటన ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ముఖ్యంగా మిట్స్ విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయంలో ఒక సెమిస్టర్ చదివే అవకాశం కల్పించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యా పరిజ్ఞానంతో పాటు వివిధ దేశాల విద్యా విధానాలు, సంస్కృతులను తెలుసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ విద్యా మార్పిడి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, పరిశోధనా దృక్పథం, అంతర్జాతీయ పోటీ సామర్థ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. మిట్స్ విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్య, అంతర్జాతీయ పరిశోధన, ఇతర విద్యా అవకాశాలను మరింత సులభతరం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిట్స్ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసోసియేట్ డైరెక్టర్–ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు. విజయలక్ష్మి, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.



