తాగునీరు, రోడ్లు, వ్యవసాయ–ఉద్యాన శాఖలపై సమీక్ష
గైర్హాజరైన అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోకు ఆదేశం
మదనపల్లి, ఆగస్టు 28:( gtvmedia)మదనపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం పాల్గొని మండలంలోని పలు సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తాగునీటి సమస్యలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సంబంధించిన అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉద్యాన శాఖ మండల అధికారి సమావేశానికి గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సమావేశానికి వస్తుంటే సంబంధిత అధికారులు గైర్హాజరు కావడం సరికాదన్నారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులందరికీ నోటీసులు జారీ చేసి, వారి గైర్హాజరుపై వివరణ కోరాలని ఎంపీడీవోను ఆదేశించారు.
రూ.45 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మదనపల్లి మండలంలో దాదాపు రూ.45 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. డీఎంఎఫ్ నిధులతో సుమారు రూ.10 కోట్లతో లింక్ రోడ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.
మదనపల్లి–రామసముద్రం, మదనపల్లి–నిమ్మనపల్లి రహదారులు గతంలో అధ్వాన స్థితిలో ఉండేవని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రస్తుతం ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారానికి కృషి
మండలంలో ఎక్కడ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని షాజహాన్ బాషా అన్నారు. నిధుల సమస్య ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అభినందనలు
ప్రస్తుత ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఇదే చివరి మండల పరిషత్ సమావేశం కావడంతో గత ఐదేళ్లుగా ప్రజలకు సేవలందించిన ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు అందించిన సేవలను కొనియాడారు.

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన మహిళలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మండల పరిషత్ సమావేశానికి హాజరైన మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాఖీ కట్టి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన, పేదల ఆర్థిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.
