మదనపల్లి, ఆగస్టు 13: (gtvmedia)80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న ముందస్తు వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా గురువారం టిప్పు సుల్తాన్ మైదానం నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు.

మదనపల్లి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, మహిళలు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు ఒక కిలోమీటర్ పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ దేశభక్తి నినాదాలతో పట్టణంలో ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ మదనపల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకలు ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ‘వందేమాతరం’ నినాదాలతో మదనపల్లి పట్టణం మార్మోగిందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

రేపు సాయంత్రం టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

#Madanapalli #IndependenceDay #ShajahanBasha
