మదనపల్లెలో గ్యాస్ లీక్.. తల్లి, కుమార్తె తీవ్రంగా గాయాలు
మదనపల్లె, ఆగస్టు 3: (gtvmedia)మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో సోమవారం ఉదయం గ్యాస్ లీక్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లి జ్యోతి (26), కుమార్తె లహరి (8) తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం ప్రకారం, కుమార్తెను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో బాత్రూంలో ఉన్న గ్యాస్ గీజర్‌ను ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తల్లి, కుమార్తె మంటల్లో చిక్కుకున్నారు.
బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఇద్దరినీ రక్షించారు. అనంతరం వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గ్యాస్ లీకేజీ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
