నిబంధనలు మీరిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె, ఆగస్టు 29:( gtvmedia)ఈ నెల 30న ఆదివారం నిర్వహించనున్న నీట్–పీజీ పరీక్షకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మదనపల్లెలో మిట్స్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలు, రాయచోటిలో శ్రీ సాయి, భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 8.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పరీక్ష కేంద్రాల చుట్టూ 200 నుంచి 300 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలిపారు. ఈ పరిధిలోని జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడం పూర్తిగా నిషేధమని ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా పేపర్ లీక్‌కు సంబంధించిన వదంతులు సృష్టించడం, పరీక్షలో అక్రమాలకు పాల్పడటం లేదా ఇతరులను అక్రమాలకు ప్రేరేపించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.
