నీటి జలాలతోనే రైతు కళ్లలో వెలుగులుహాంద్రీ –నీవా జలాలతో చెరువులు నింపాలిభూగర్భ జలాలను కాపాడి.. రైతాంగాన్ని ఆదుకోవాలిరైతు నాయకుడు భీమగాని పద్మనాభరెడ్డి

మదనపల్లె, సెప్టెంబర్ 3: కరువు నేలల్లో రైతు బతకాలంటే సాగునీటి భరోసా కల్పించడమే శాశ్వత పరిష్కారమని రాష్ట్ర రైతు-కూలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భీమగాని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గురువారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం లో అయన మాట్లాడుతూ హాంద్రీ నీవా జలాలతో తంబళ్లపల్లి నియోజకవర్గం లోని చెరువులను నింపడంతో పాటు వర్షపు నీటిని సమర్థవంతంగా సంరక్షించి భూగర్భ జలాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.‘రైతుకు కావాల్సింది కేవలం హామీలు కాదు.. పొలానికి నీరు. చెరువులో నీరు ఉంటే బోరులో నీరు ఉంటుంది.. బోరులో నీరు ఉంటే రైతు కళ్లలో వెలుగు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు నీటిని ఒడిసిపట్టే విధంగా చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించి ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలన్నారు.
హాంద్రీ నీవా జలాలను చెరువులకు మళ్లించడం ద్వారా ఒకవైపు సాగునీటి సమస్య తగ్గడంతో పాటు మరోవైపు భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏటా బోర్లు ఎండిపోవడం, వందల అడుగుల లోతుకు వెళ్లినా నీరు దొరకకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.
చెరువుల ఆక్రమణలను తొలగించి, పూడికతీత పనులు చేపట్టి, నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించాలని కోరారు. వ్యవసాయ సముదాయాల వారీగా చెరువులను గుర్తించి హాండ్రీ–నీవా నీటితో నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘‘చెరువు నిండితే గ్రామం కళకళలాడుతుంది.. భూగర్భ జలాలు పెరిగితే రైతుకు భరోసా వస్తుంది. రైతు నిలబడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది’’ అని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మకు వినతి పత్రం అందజేశారు. హెచ్ఎఎన్ ఎస్ ఏస్ ఈ ని కలసి పరిస్థితిని వివరించారు. రైతులు రైతు కూలీల భవిష్యత్తు కోసం చేస్తున్న న్యాయమైన పోరాటానికి రైతులు రైతు సంఘాలు సహకరించాల్సిందిగా కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *