11 మందికి 10 రోజుల జైలు శిక్ష
మదనపల్లె, సెప్టెంబర్ 9:
అన్నమయ్య జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ పోలీసులు నేరాలకు చెక్ పెడుతున్నారు.
ఇందులో భాగంగా మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా పక్కాగా నిఘా ఉంచారు. గత జూలై 28వ తేదీన మదనపల్లె మండలం, వలసపల్లె పంచాయతీ పరిధిలోని బోగిటివారిపల్లె వద్ద బహిరంగ ప్రదేశంలో అక్రమంగా కోడిపందేలు ఆడుతున్న 11 మందిని డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై ఏపీ గేమింగ్ యాక్ట్-1974 కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ కేసును విచారించిన మదనపల్లె సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్, పోలీసుల సాక్ష్యాధారాలను పరిశీలించి నేరం రుజువు కావడంతో పట్టుబడిన 11 మంది నిందితులకు 10 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.
