డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మదనపల్లె, జూలై 31: (gtvmedia)మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లె జాయింట్ కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో కొందరికి అనుకూలంగా ఉద్యోగాలు కల్పించారని, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.

మెగా డీఎస్సీ పేరుతో కేవలం 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, పరీక్ష నిర్వహణలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 1.25 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని, 26 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినా ఎలాంటి వివాదాలకు తావివ్వలేదని పేర్కొన్నారు.

విద్య, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, ప్రస్తుతం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు ప్రయోజనం కలిగిందని, ప్రస్తుతం ఆ విధానాలకు విఘాతం కలుగుతోందని ఆరోపించారు.

డీఎస్సీ నియామకాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన, మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంపై చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం చూపాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *