మదనపల్లె, ఆగస్టు 7: (gtvmedia )డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా క్యాబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్ ప్రశ్నలు లేవనెత్తారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ఆయన క్యాబినెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారా అని సందేహం వ్యక్తం చేశారు.
మదనపల్లె టౌన్ అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ యువజన విభాగం, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలకు నిస్సార్ అహమ్మద్ మద్దతు తెలిపి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు. గత నాలుగు క్యాబినెట్ సమావేశాల్లో రెండు సమావేశాల నుంచి మధ్యలో వెళ్లిపోయారని, మరో రెండు సమావేశాలకు గైర్హాజరయ్యారని పేర్కొంటూ, దీనిపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని గుర్తుచేస్తూ, క్యాబినెట్ సమావేశాలకు మాత్రం హాజరు కాకపోవడానికి అసలు కారణం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.
అలాగే, రెండున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి అమలు కాలేదని ఆరోపిస్తూ, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువత తరఫున పోరాటం కొనసాగిస్తామని నిస్సార్ అహమ్మద్ తెలిపారు.
