మదనపల్లె, ఆగస్టు 17:( gtvmedia)అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో పరిష్కారం కాకుండా సీఎం పేషీకి బదిలీ అయిన అర్జీల పరిష్కారంపై ఇన్‌చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రత్యేక దృష్టి సారించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో సీఎం పేషీకి బదిలీ అయిన 13 అర్జీలను ఇన్‌చార్జి కలెక్టర్ పరిశీలించారు. అర్జీదారులను స్వయంగా విచారించి, వారి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో ఏవైనా లోపాలు, పొరపాట్లు ఉంటే వెంటనే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా కొన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాని సందర్భాల్లో అర్జీదారులకు విషయాన్ని స్పష్టంగా, వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.
