స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
యువత, విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి. *... ఎమ్మెల్యే షాజహాన్ బాషా.*


మదనపల్లె, ఆగస్టు 13: దేశభక్తి, జాతీయ సమైక్యతకు మదనపల్లె మైలురాయిగా నిలిచిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం రెండో రోజు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు భారీ జాతీయ సమైక్యతా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో వేలాది మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళలు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు వెయ్యి మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ, దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ… స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
మదనపల్లెలో అన్ని వర్గాల ప్రజలు ఒకే జెండా కింద ఐక్యంగా నిలిచి ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమని అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, ఇదే దేశ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకుని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా ఎదగాలని సూచించారు. యువతలో దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
భారతదేశం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అందించాలని, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
మదనపల్లె పట్టణం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇక్కడి ప్రజల ఐక్యత, సోదరభావం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకలు ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సేతు, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
————-///——————
