మదనపల్లిలో ఘనంగా AISF 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బి.టి. కళాశాల వద్ద AISF అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె. మాధవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో AISF పతాకాన్ని మాజీ నాయకులు పి. మహేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం కూడా విద్య అందరికీ అందుబాటులో ఉండేలా, పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించేలా, విద్యా రంగంలోని అసమానతలను తొలగించే లక్ష్యంతో AISF అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. విద్యార్థుల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ AISF ఉద్యమం ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థుల హక్కులను అణచివేయడం సరికాదని నాయకులు అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ విద్యార్థులు తమ విద్యా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. విద్యా హక్కులు అడిగినందుకు విద్యార్థులపై దాడులు చేయడం, ప్రశ్నించినందుకు అణచివేతకు పాల్పడటం సరికాదని ప్రభుత్వాలను ప్రశ్నించారు.

విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో విద్యా రంగ సమస్యలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు నిర్వహించిన ఉద్యమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అలాగే ఝార్ఖండ్‌లో విద్యార్థులు పరీక్షలు, నియామక ప్రక్రియల్లో పారదర్శకత కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్న పోరాటాలు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల అవసరాన్ని తెలియజేస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో AISF మాజీ నాయకులు మురళీకృష్ణ, AIYF మాజీ నాయకులు సాంబశివ, AISF అన్నమయ్య జిల్లా గర్ల్స్ కో-కన్వీనర్ నవ్య, AIYF జిల్లా అధ్యక్షులు విజయన్, AISF నియోజకవర్గ కార్యదర్శి సాయికిరణ్, AIYF జిల్లా ఉపాధ్యక్షులు ఓబులేష్, AISF నాయకులు అమృత, మొహమ్మద్ ఆసిఫ్‌తో పాటు బి.టి. కళాశాల, ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *