రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
మదనపల్లి, ఆగస్టు 12: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపిన వివరాల మేరకు.. పీలేరుకు చెందిన సుబ్రహ్మణ్యం, ఉమాదేవి దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా ఉమాదేవికి వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత ఆరు నెలలుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భర్తతో విసిగిపోయిన ఉమాదేవి, తన ప్రియుడు వెంకట సుబ్రహ్మణ్యంతో కలిసి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ రాత్రి సుబ్రహ్మణ్యం తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రమాత్రలు కలిసిన ఆహారం తిని మత్తులోకి వెళ్లిన అనంతరం ఇనుప రాడ్డు, బండరాళ్లతో తలపై కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు.
అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పీలేరు సమీపంలోని జాతీయ రహదారిపై పడేశారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఉమాదేవి, ఆమె ప్రియుడు వెంకట సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పీలేరు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
