రైలు కిందపడి 22 ఏళ్ల మహిళ మృతి

పీలేరు, అన్నమయ్య జిల్లా: (gtvmedia)పీలేరు రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి 22 ఏళ్ల మహిళ మృతి చెందింది. మృతురాలిని ఆకులవారిపల్లెకు చెందిన డేరంగుల శివకుమార్ భార్య డేరంగుల అంజమ్మ (22)గా గుర్తించినట్లు సమాచారం.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అంజమ్మ మద్యం సేవించి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడిన అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో పీలేరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన ఆమె.. ట్రాక్ మరమ్మతుల కోసం వెళ్తున్న రైలు ఇంజిన్ కింద పడి మృతి చెందినట్లు సమాచారం.

లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో కదిరి నుంచి రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

అంజమ్మ మృతి ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *