తిరుపతి, ఆగస్టు 12: (gtvmedia)పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపి ఓ వితంతువు నుంచి బంగారు నగలు, నగదు దోచుకున్న ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. బాధితురాలు ఇద్దరు పిల్లలతో అయోమయానికి గురై అలిపిరి పోలీసులను ఆశ్రయించింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన మహిళ భర్త సూళ్లూరుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో భద్రమ్మ అనే మహిళ దూరపు బంధువుగా పరిచయం చేసుకుని ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంది. ఒంటరిగా ఎన్నాళ్లు ఉంటావంటూ.. తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, అతడిని పెళ్లి చేసుకోవచ్చంటూ బాధితురాలికి భద్రమ్మ ఆశలు కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి కోసం బంగారు నగలు ధరించి అందంగా రావాలని చెప్పి ఆమెను తిరుపతికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి భద్రమ్మ వెళ్లిపోయిందని, ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి వస్తాడని చెప్పినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
తర్వాత ప్రసాద్‌రెడ్డి ఎనిమిదేళ్ల కుమార్తెతో ఉన్న బాధితురాలిని తీసుకెళ్లి నంది సర్కిల్ సమీపంలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు తిరుమలకు వెళ్దామని చెప్పి ఆమెను ఆటోలో బస్టాండ్ వద్దకు తీసుకువచ్చాడు. కారు తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడంతో బాధితురాలు తన బ్యాగును పరిశీలించగా అందులోని 8 సవర్ల బంగారు నగలు, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి అలిపిరి పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై శ్రీవాణి ఆధ్వర్యంలో నిందితుల కోసం విచారణ కొనసాగుతోంది.
