తెలుగు నాటక రంగానికి ప్రాణం పోసిన మహానుభావుడు, గొప్ప సామాజిక సేవకుడు బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది.
ఆదివారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బళ్ళారి రాఘవ గారి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి పాల్గొని, బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలతో అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి మాట్లాడుతూ.. బళ్ళారి రాఘవ కేవలం ఒక నాటక కళాకారుడు మాత్రమే కాదని, తన కళ ద్వారా సమాజంలో నెలకొన్న దురాచారాలను ప్రశ్నించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆయన ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి, నైతిక విలువలను పెంపొందించేలా ఉండేవని గుర్తుచేశారు.
న్యాయం, ధర్మం, మానవత్వం వంటి ఉన్నత విలువలను తన జీవితాంతం పాటించిన బళ్ళారి రాఘవ జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని యువ కళాకారులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, తెలుగు సంస్కృతిని, కళలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, సమాజానికి మేలు చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు , ఆర్ఎస్ఐ లు శ్రీనివాస్, రవి, చంద్రశేఖర, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని రాఘవ ఘనంగా నివాళులు అర్పించారు.
