మదనపల్లె: పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో నిన్న రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా తన చేతులతో ప్రతి ఒక్కరికీ భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారణ విశిష్టత, దీక్షా నియమాలు, ఆచార వ్యవహారాల గురించి వివరించారు.
అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం, సమానత్వం, భక్తిభావం, సేవాగుణాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. స్వామి శరణం అయ్యప్ప నామస్మరణతో పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.
