మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం వారు ఐఈఈఈ కమ్యూనికేషన్స్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ మరియు ఫ్రాన్స్ చాప్టర్ల సహకారంతో “ది నెట్వర్క్ ఈజ్ ది కంప్యూటర్: నెట్వర్కింగ్ ఫర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్” అనే అంశంపై ఒకరోజు సాంకేతిక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ప్లానోలో గల క్యాటలిస్ట్ బ్రాండ్స్ సంస్థలో మౌలిక సదుపాయాల ఇంజినీరింగ్ విభాగంలో ప్రధాన క్లౌడ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న నాగ ఎస్. చెరుకుపల్లె పాల్గొని, విద్యార్థులకు ఆధునిక కృత్రిమ మేధస్సు సాంకేతికతలో నెట్వర్కింగ్ వ్యవస్థల ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు నమూనాలకు శిక్షణ ఇచ్చే ప్రక్రియలో వేలాది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ పనిచేస్తాయని అన్నారు. నెట్‌వర్క్‌లో ఏర్పడే చిన్నపాటి ఆలస్యం సైతం మొత్తం శిక్షణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని అన్నారు. రెండు అంచెల నెట్వర్క్ ద్వారా ఒక లక్ష ముప్పై ఒక్క వేలకుపైగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను అనుసంధానించే విధానాన్ని ఉదాహరణలతో వివరించారు. గూగుల్ సంస్థ రూపొందించిన విర్గో నెట్వర్క్ విధానాన్ని కూడా ఉదాహరణగా చూపించారు. అలాగే సమాచారాన్ని వేగంగా ప్రసారం చేసే ఆధునిక సిగ్నలింగ్ పద్ధతులు, కాంతి ఆధారిత సమాచార ప్రసార సాంకేతికతలు, ప్రత్యేకమైన ఫైబర్ కేబుళ్ల గురించి వివరించారు. విద్యుత్ సరఫరా పరిమితుల కారణంగా పలు డేటా కేంద్రాలను అనుసంధానించి కృత్రిమ మేధస్సు శిక్షణను నిర్వహించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. పరిశ్రమల్లో ప్రస్తుతం అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, భవిష్యత్తులో పరిశోధనలు చేయడానికి అనువైన అంశాలు, చివరి సంవత్సరం విద్యార్థులు చేపట్టదగిన ప్రాజెక్టుల గురించి తెలిపారు. ఆధునిక నెట్వర్కింగ్ సాంకేతికతల్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ నెట్వర్కింగ్, డేటా సెంటర్ నిర్వహణ, నెట్వర్క్ ఆటోమేషన్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మిట్స్ ఐఈఈఈ కమ్యూనికేషన్స్ సొసైటీ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ వి.జయ ప్రకాషన్, కోఆర్డినేటర్ జి.చరణ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు



