మదనపల్లె, ఆగస్టు 1:( gtvmedia)మదనపల్లె మండలంలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు సృష్టించి భూమి విక్రయం పేరుతో రూ.14 లక్షలు మోసం చేసిన ఐదుగురిని తాలూకా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీ బుచ్చి రాజు మీడియాకు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మదనపల్లె మండలం బసినికొండ డ్రైవర్స్ కాలనీకి చెందిన పొన్నం శోభారాణికి గంగన్నగారిపల్లె వద్ద ఉన్నట్లు నమ్మించి, 2.52 ఎకరాల భూమి తమదేనని తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయానికి ప్రయత్నించారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసి భూమిని విక్రయిస్తున్నట్లు నమ్మబలికి బాధితురాలి నుంచి రూ.14 లక్షలు కాజేశారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉప్పుతోళ్ల శేఖర్, మురళి, ఎర్రప్ప, మణి, రెడ్డెప్పలను అరెస్టు చేశారు.
నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. భూముల కొనుగోలు సమయంలో అసలు రికార్డులను రెవెన్యూ శాఖలో తప్పనిసరిగా పరిశీలించాలని, నకిలీ పత్రాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.
