మదనపల్లె, ఆగస్టు 1: (gtvmedia)ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడలో ధరించే స్కార్ఫ్ సాహసానికి, ఐక్యతకు, సేవాభావానికి ప్రతీక అని అన్నమయ్య జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి నేతృత్వంలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు జిల్లా ఎస్పీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గౌరవ సూచకంగా స్కార్ఫ్‌ను ధరింపజేశారు. అనంతరం జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి స్కౌటింగ్ అందిస్తున్న తోడ్పాటు గురించి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, పెద్దల పట్ల గౌరవం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించడంలో స్కౌట్ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు స్కౌట్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. జిల్లాలో బాలబటుల ఉద్యమం మరింత బలోపేతం కావడానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి నిర్వహించి, వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.
తదనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనురాధలను వారి కార్యాలయాల్లో కలిసి స్కౌట్ అధికారులు గౌరవ సూచకంగా స్కార్ఫ్‌ను ధరింపజేశారు.
ఈ కార్యక్రమంలో గైడ్స్ లీడర్ ట్రైనర్ శకుంతల, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ (స్కౌట్స్) చంద్రశేఖర్, అడ్వాన్స్‌డ్ స్కౌట్ మాస్టర్ మహమ్మద్ ఖాన్, లక్ష్మీకర్, మడితాటి నితిన్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, గైడ్ కెప్టెన్లు సాయి కిరణ్ కుమారి తదితరులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు పాల్గొన్నారు.
