మిట్స్‌ యూనివర్సిటీకి శోధ్‌గంగ, శోధ్‌గంగోత్రి ప్రాజెక్టుల అమలుకు ఎంఓయూ

పరిశోధనా ఫలితాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా కీలక ముందడుగు

మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ (మిట్స్‌) డీమ్డ్ టు బి యూనివర్సిటీకి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (యూజీసీ)కు చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్‌ (ఇన్‌ఫ్లిబ్‌నెట్‌)తో శోధ్‌గంగ, శోధ్‌గంగోత్రి ప్రాజెక్టుల అమలుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ సి. యువరాజ్‌ వెల్లడించారు.

ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలో పరిశోధనా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, పరిశోధనా ఫలితాలను డిజిటల్‌ రూపంలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.

మిట్స్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధకులు సమర్పించే పరిశోధనా సిద్ధాంత గ్రంథాలను శోధ్‌గంగ డిజిటల్‌ వేదికలో భద్రపరిచి, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులకు అందుబాటులో ఉంచవచ్చని వివరించారు. అదేవిధంగా, పీహెచ్‌డీ ప్రవేశానికి ఆమోదం పొందిన పరిశోధనా ప్రతిపాదనలు, వాటి సారాంశాలను శోధ్‌గంగోత్రి వేదికలో నమోదు చేయవచ్చన్నారు.

దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఇప్పటికే వివిధ అంశాలపై జరిగిన పరిశోధనలను తెలుసుకొని, కొత్త ఆలోచనలతో మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. పరిశోధకులు రూపొందించిన విలువైన పరిశోధనా ఫలితాలు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల ఇతర విశ్వవిద్యాలయాల పరిశోధకులు కూడా వాటిని అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ విధానం ద్వారా విద్యాసంస్థల మధ్య పరిశోధనా సహకారం పెరిగి, నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందని వైస్‌ ఛాన్సలర్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫ్లిబ్‌నెట్‌ కేంద్రం ద్వారా డిజిటల్‌ పరిశోధనా పత్రాల నిర్వహణకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణ, సాఫ్ట్‌వేర్‌ సదుపాయాలు పొందేందుకు కూడా అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ ఒప్పందం మిట్స్‌ యూనివర్సిటీలో పరిశోధనా నాణ్యతను పెంపొందించడంతో పాటు, విద్యార్థులు, పరిశోధకుల్లో పరిశోధనా దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి, యూనివర్సిటీ పరిశోధనా ఫలితాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి. ప్రదీప్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. రామనాథన్‌, లైబ్రరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గంగిశెట్టి, లైబ్రేరియన్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *