మదనపల్లె, సెప్టెంబర్ 22: మదనపల్లె పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బృహత్తర అడుగు పడింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కింద పట్టణ అభివృద్ధి పనుల కోసం రూ.27 కోట్ల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం వేదికగా వర్చువల్ విధానంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మదనపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి వర్చువల్ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.


HAM పథకం ద్వారా విడుదలైన నిధులతో మదనపల్లె పట్టణంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
