మదనపల్లె, సెప్టెంబర్ 19: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్ (24), ఇమ్రాన్ (30) టమోటాలు అన్‌లోడ్ చేసి బొలెరో వాహనంలో మదనపల్లెకు వస్తుండగా.. వలసపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
