మదనపల్లె, సెప్టెంబర్ 10: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌పై ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు చెన్నైకి చెందిన నలేమ్టన్ ఇన్ఫోటెక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ నలేమ్టన్ ఎస్. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన అవసరమన్నారు.

సంస్థల డేటా, కంప్యూటర్ సిస్టమ్స్, నెట్‌వర్క్‌ల భద్రతకు అనుసరించాల్సిన విధానాలతో పాటు ఆధునిక సైబర్ సెక్యూరిటీ టూల్స్, మెథడాలజీలపై విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత అవగాహన కల్పించారు. ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్ ద్వారా సిస్టమ్స్‌లోని భద్రతా లోపాలను ముందుగానే గుర్తించి, సైబర్ దాడులను నివారించేందుకు రక్షణ చర్యలు చేపట్టవచ్చని వివరించారు.
నెట్వర్క్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్లు, మాల్వేర్, ఫిషింగ్ దాడులు, డేటా సెక్యూరిటీ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ సమన్వయం భవిష్యత్ డిజిటల్ భద్రతలో కీలకంగా మారనుందని పేర్కొన్నారు.
ఏఐ ఆధారిత సెక్యూరిటీ టూల్స్‌పై అవగాహనతో పాటు నైతిక విలువలు, చట్టపరమైన పరిమితులు, బాధ్యతాయుతమైన సైబర్ ప్రాక్టీసులను విద్యార్థులు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ సెక్యూరిటీపై సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉన్న వారికి సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ప్రభుత్వ, రక్షణ, ఐటీ తదితర రంగాల్లో ఉద్యోగ, కెరీర్ అవకాశాలు ఉన్నాయని వివరించారు.
కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్. కుసుమ, కోఆర్డినేటర్ ఆరోక్యరాజ్ ఎ.తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
