పుంగనూరు, సెప్టెంబర్ 10: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నూతన ఇన్‌చార్జిగా వై. మధుసూదన్ నాయుడు నియమితులైన సందర్భంగా గురువారం పుంగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో కలిసి మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ నూతన ఇన్‌చార్జి వై. మధుసూదన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో టీడీపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా మధుసూదన్ నాయుడు అందుబాటులో ఉండి అండగా నిలుస్తారని అన్నారు.
కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, 2029 ఎన్నికల్లో పుంగనూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పిలుపునిచ్చారు.

