విద్యుత్‌ షాక్‌తో మగ ఏనుగు మృతి

పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో విషాదం

మదనపల్లె, సెప్టెంబర్‌ 2: gtvmedia చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ మగ ఏనుగు మృతి చెందింది. పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పరిసరాల్లో సంచరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. మామిడి తోటలోని బోర్‌వెల్‌ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్‌ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో వాటిని తాకి ఏనుగు విద్యుదాఘాతానికి గురై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతి చెందిన ఏనుగు సుమారు 13 ఏళ్ల వయసున్న మగ ఏనుగుగా గుర్తించారు.

ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా

ఏనుగు మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్‌ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు.

ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు

వన్యప్రాణులు సంచరించే అటవీ ప్రాంతాలు, వాటికి ఆనుకుని ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్‌ తీగలను తగినంత ఎత్తులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖతో అటవీ శాఖ సమన్వయం చేసుకుని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లను గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

వన్యప్రాణుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్‌ మౌలిక వసతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *