పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
మదనపల్లె, సెప్టెంబర్ 1: (gtvmedia)
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా APCPSEA ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా APCPSEA రాష్ట్ర ఉపాధ్యక్షులు సొరకాయల శ్రీనివాసులు, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు గడుస్తున్నా సీపీఎస్ రద్దుపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
“రిటైర్మెంట్ తర్వాత రూ.3,882 పెన్షనా?”
సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెన్షన్ సమస్యలను వివరిస్తూ వారు రిటైర్డ్ VRO అశోక్ రెడ్డి ఉదాహరణను ప్రస్తావించారు. సుమారు 25 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆయన చివరి జీతం రూ.56,485 కాగా, సీపీఎస్ విధానం కారణంగా పదవీ విరమణ అనంతరం నెలకు కేవలం రూ.3,882 పెన్షన్ మాత్రమే వస్తోందని తెలిపారు.
ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు భరోసా కల్పించేలా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
తమ డిమాండ్‌ను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సత్తా చూపిస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర కుమార్, శీను, సూర్య ప్రకాష్, రాజన్న, హరినాథ్, రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖిల్లా నాగరాజు, అశోక్ రెడ్డి, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
