ఆగస్టు 27న స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమం
విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్‌గా సంభాషించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 27న ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్ – స్పోర్ట్స్ ఎడిషన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్‌గా సంభాషించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, క్రీడల అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్రీడా రంగంలో పురోగతిపై ప్రధాని ప్రసంగం
గత 12 సంవత్సరాల్లో భారత క్రీడా రంగంలో సాధించిన పురోగతి, క్రీడా మౌలిక వసతుల విస్తరణ, యువ క్రీడాకారులకు అందుతున్న అవకాశాలు, క్రీడా పర్యావరణ వ్యవస్థలో వచ్చిన మార్పులపై ప్రధానమంత్రి ప్రసంగించనున్నట్లు డాక్టర్ రామనాథన్ తెలిపారు.
అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులు, క్రీడాకారులు ఉదయం 10 గంటలలోపు యూనివర్సిటీకి చేరుకోవాలని సూచించారు.
ప్రధాని ప్రసంగం అనంతరం యువత, ‘మై భారత్’ వాలంటీర్లు, స్థానిక క్రీడాకారులతో పరస్పర చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడా రంగ అభివృద్ధి, యువతకు అందుతున్న అవకాశాలు, భవిష్యత్‌లో క్రీడల్లో రాణించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నట్లు చెప్పారు.
యువత క్రీడల్లో పాల్గొనాలి
యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జాతీయ భావన పెంపొందుతాయని ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, ఎన్‌సీసీ ఆఫీసర్ పి. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
