టెట్ రద్దు, పీఆర్సీ సాధనకు చలో విజయవాడ

యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్‌లో తీర్మానం

మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)2010కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ తెలిపారు.

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని జిడ్డు కృష్ణమూర్తి మెమోరియల్ హాల్‌లో యూటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేశారు.

టెట్ రద్దు కోసం ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి బైక్ జాతాలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఆగస్టు 31న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పీఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి

పీఆర్సీ గడువు ముగిసి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని యూటీఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం, ఆర్థిక బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, మిగిలిన ఆర్థిక బకాయిలను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

పీఆర్సీ సభలకు పిలుపు

పీఆర్సీ సాధనలో భాగంగా సెప్టెంబర్ 12న తిరుపతిలో, 13న రాజమండ్రిలో, 20న గుంటూరులో పీఆర్సీ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

అప్పటికి ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు డీఏలు ప్రకటించి, ఐఆర్ ప్రకటించాలని, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ చివరి వారంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాలను చేపడతామని యూటీఎఫ్ నాయకులు తెలిపారు.

ఈ మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్, కుసుమ కుమారి, రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మీ రాజా, ఎస్.ఎస్.నాయుడు, ఎస్.పీ.మనోహర్, నవ కోటేశ్వరరావు, చక్రవర్తి, కిషోర్, సుభాషిని, శ్రీలక్ష్మి, శ్రీదేవి, జి.వి.రమణ, జాబిర్, రవి, దేవేంద్రమ్మ, జయకర్, రాష్ట్ర ప్రచురణల విభాగం కన్వీనర్ హనుమంతరావుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *