నకిలీ పత్రాలతో ఇబ్బంది పెడుతున్నారంటూ జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

మదనపల్లె, ఆగస్టు 18:( gtvmedia)
తమకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమికి సంబంధించి అన్ని ఆధారాలు సరిగ్గా ఉన్నప్పటికీ, మదనపల్లికి చెందిన బాలకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు హర్షవర్ధన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హనుమంతు రెడ్డిలు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మదనపల్లి రూరల్ మండలం పొన్నేటి పాలెం పంచాయితీ పరిధిలోని వ్యవసాయ భూమికి సంబంధించి 1బి, ఈసీ, ఆర్ఓఆర్ రెవెన్యూ రికార్డులు తరిగొండ రెడ్డమ్మ, తరిగొండ సుజాత, హనుమంతరెడ్డిల పేరు మీద నమోదై ఉన్నాయన్నారు. కృష్ణారెడ్డి భార్య చిన్నన తిమ్మారెడ్డికి వారసత్వ భూమికి సంబంధించి ఈ నెల 12వ తేదీన కుటుంబ సభ్యులు భాగ పరిష్కారం చేసుకుని అధికారికంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామన్నారు. ఇందులో భాగంగా నరసింహారెడ్డి ఆస్తిని ఆయన భార్య రెడ్డమ్మ పేరుతో, భరత్‌రెడ్డి భాగాన్ని ఆయన భార్య సుజాత పేరుతో, మరియు హనుమంత్‌రెడ్డి మూడో భాగాన్ని పంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. 2022లో నరసింహారెడ్డి మరణించినప్పటికీ, ఆధార్ సీడింగ్ ఆయన పేరుతో ఉండటం వల్ల ప్రారంభంలో ఆయన పేరుపైనే మ్యుటేషన్ అయింది. అయితే, సాంకేతిక అంశాన్ని గుర్తించిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు ఆటోమేటిక్ మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా భూమిని రెడ్డమ్మ పేరుకు మార్చేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. అయితే కె.సావిత్రి అనే మహిళ వద్ద నుంచి 2011లోనే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు బాలకృష్ణారెడ్డి నకిలీ స్టాంప్ పేపర్లు, పత్రాలు సృష్టించారని బాధితులు ఆరోపించారు. ఈ వివాదంపై ఇప్పటికే సివిల్ కోర్టు తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ నకిలీ పత్రాలతో తమను నిరంతరం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసి, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *