80వ స్వాతంత్ర్య దినోత్సవ కానుక: 79 కిలోమీటర్ల స్కేటింగ్ సాహసానికి శ్రీకారం చుట్టిన మూడేళ్ల బాలుడు ‘అనంత దక్షిత్’!

మదనపల్లె (ఆగస్టు 14): (gtvmedia)భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఒక మూడేళ్ల చిన్నారి అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. పట్టుదల, కఠోర సాధనకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ మదనపల్లెకు చెందిన మూడేళ్ల బాలుడు అనంత దక్షిత్ ఏకంగా 79 కిలోమీటర్ల సుదీర్ఘ జాతీయ రహదారిపై స్కేటింగ్ యాత్రను ప్రారంభించాడు.

అమ్మ చెరువు మిట్ట సర్కిల్ నుంచి కదిరి వైపుగా…

శుక్రవారం ఉదయం 5:30 గంటలకు మదనపల్లె పట్టణంలోని అమ్మ చెరువు మిట్ట సర్కిల్ వద్ద ఈ స్కేటింగ్ సాహస యాత్ర అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ యాత్ర అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మీదుగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వరకు సాగనుంది.

ఆగస్టు 15న నూతనంగా జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న మదనపల్లె పెరేడ్ గ్రౌండ్‌లో ఎగురవేసే జాతీయ పతాకాన్ని తన భుజాన వేసుకొని చిన్నారి అనంత దక్షిత్ ఈ రికార్డు యాత్ర చేపట్టడం విశేషం.

బాలుడికి తోడుగా ఇండో-టిబెటన్ పోలీస్ (ITBP) బలగాలు

ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ రికార్డు యాత్రలో కలికిరికి చెందిన ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ITBP) బలగాలు అనంత దక్షిత్‌కు మద్దతుగా 79 కిలోమీటర్ల పొడవునా రక్షణగా వెళ్తున్నారు. అంతేకాకుండా, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు కూడా చిన్నారికి మద్దతుగా ఈ స్కేటింగ్ యాత్రలో భాగస్వాములయ్యారు.

ఆరు నెలల కఠోర శిక్షణ: “ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం కోసం మూడేళ్ల అనంత దక్షిత్ గత ఆరు నెలలుగా కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఈ యాత్ర విజయవంతమై ప్రపంచ రికార్డుల్లో నిలవాలని ఆశిస్తున్నాం. ఈ యాత్రకు మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు ప్రత్యేకంగా సహకరించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు అందించింది.” — ప్రతాప్, స్కేటింగ్ కోచ్

చిన్నతనంలోనే దేశభక్తి స్ఫూర్తితో గిన్నిస్ ప్రపంచ రికార్డు లక్ష్యంగా సాగుతున్న మూడేళ్ల చిన్నారి అనంత దక్షిత్ సాహసాన్ని పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు మరియు స్థానిక ప్రజలు విశేషంగా ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *