మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం.

మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మిట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ క్లబ్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (SAC) సహకారంతో “మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం (Women’s Entrepreneurship Day)” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా, మదనపల్లెకు చెందిన అరీవేణి హ్యాండీక్రాఫ్ట్స్ వ్యవస్థాపకురాలు, చందన మహిళా మండలి ప్రతినిధి లీలావతి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు తమలోని నైపుణ్యాలను గుర్తించి, వాటిని ఆర్థిక స్వావలంబనకు మార్గాలుగా మలుచుకోవాలని అన్నారు. తన స్వీయ అనుభవాలను వివరిస్తూ, 1992లో హస్తకళల రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ విశేష ప్రతిభను కనబరుస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. చిన్న వ్యాపార ఆలోచనలతో ప్రారంభించి, క్రమంగా వాటిని విజయవంతమైన సంస్థలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, సోషల్ మీడియా, ఆర్థిక నిర్వహణ, మార్కెట్ విశ్లేషణ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని వివరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ వ్యాపార వేదికలు మహిళా పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ, దేశ ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు, తమలోని నైపుణ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో వినూత్న ఆలోచనలను వ్యాపారాలుగా మలచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ కే.శిరీష, అధ్యాపకులు డాక్టర్ గంగిశెట్టి, శ్రీకాంత్ మరియు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *