మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్, తిరుపతి మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మదనపల్లె వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ (అడ్మినిస్ట్రేషన్) డాక్టర్ సి. కమల్ బాషా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మణికంఠ నాయుడు, ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ తిరుపతి కోఆర్డినేటర్ రవి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఒకరి ప్రాణాలను కాపాడటానికి రక్తదానం ఎంతో గొప్పదానమని అన్నారు. రక్తదానం అనేది నిస్వార్థమైన సేవతో పాటు సమాజంలోని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటమే కాకుండా, రక్తదాతల్లో కూడా సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని, వైద్యుల సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొత్తం 154 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలందరికీ ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

