ములకలచెరువు, సెప్టెంబర్ 22:
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోట జాతీయ రహదారిపై విద్యార్థులు మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు. కాలేజీలకు వెళ్లే, తిరిగి ఇళ్లకు వచ్చే సమయంలో ఆర్టీసీ బస్సులు బురకాయలకోట వద్ద నిలపడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు నిలపకపోవడంతో కాలేజీలకు వెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులను తప్పనిసరిగా నిలిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ధర్నాతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
