కురబలకోట, అక్టోబర్ 23: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని రిషి వ్యాలీ సమీపంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. వర్షం పడుతున్న సమయంలో చెట్టు కింద ఆశ్రయం పొందిన అతడిపై పిడుగు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన అతావుల్లా కుమారుడు మాలిక్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మాలిక్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని మృతుడి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
