మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారిలో సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు పనిచేయాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌తో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కెఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్డిసి మాధవరెడ్డి, సర్వే శాఖ ఏడి శాంతరాజ్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని, పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వినతులపై ప్రత్యేక దృష్టి
పిజిఆర్ఎస్‌లో పిటిఎం మండలం రాపూరివారిపల్లె పంచాయతీ నాగన్నకోటకు చెందిన మల్లంపల్లి వెంకటరమణ తనకు రెండు చెవులు వినిపించవని, వినికిడి లోపంతో బాధపడుతున్న తనకు వినికిడి యంత్రంతో పాటు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
మదనపల్లె ఇందిరానగర్‌కు చెందిన షేక్ రాహత్ జాన్ తనకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మూడో దశలో ఇల్లు మంజూరై, పట్టా ఇచ్చారని, పునాదులు కూడా వేసుకున్నప్పటికీ ప్రస్తుతం లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని అధికారుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
అదేవిధంగా మదనపల్లె మండలం పెంచుపాడు గ్రామ పంచాయతీ పందివారిపల్లెకు చెందిన మునిగుంతల రమణ తన రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్నానని, తనకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
మొత్తంగా పిజిఆర్ఎస్‌లో 347 అర్జీలు అందగా, వాటిపై తగిన చర్యలు తీసుకుని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఇన్‌చార్జ్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేశారు.
పోలీస్ ప్రజా సమస్యల వేదికలో 64 ఫిర్యాదులు

మరోవైపు మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 64 ఫిర్యాదులు నమోదయ్యాయి.
వాటిలో భూ వివాదాలు 18, న్యూసెన్స్ 11, కుటుంబ వివాదాలు 10, ఆర్థిక వివాదాలు 8, మోసం 8, ఇతర ఫిర్యాదులు 4, ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించినవి 2, తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించినవి 2, సైబర్ ఫిర్యాదు 1 ఉన్నాయి.
భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
అందిన ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తి చేసి, నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
