గంజాయి స్మగ్లర్‌ సయ్యద్ సుల్తాన్‌పై PIT NDPS అస్త్రం మదనపల్లెలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

సుల్తాన్‌పై PIT NDPS యాక్ట్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

మదనపల్లె, ఆగస్టు 17: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో 17 ఏళ్లుగా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుల్తాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఉన్న పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో PIT NDPS యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయించి, ఆరు నెలల నిర్బంధ కారాగార శిక్ష కోసం కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

17 ఏళ్లుగా నేర చరిత్ర

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కథనం మేరకు.. మదనపల్లి పట్టణంలోని దేవళం వీధికి చెందిన హుస్సేన్ కుమారుడు సుల్తాన్ (31) గత 17 ఏళ్లుగా నేర కార్యకలాపాలు, దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అతడిపై మదనపల్లి మండల పరిధిలో మొత్తం పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 హత్య కేసులు, 7 హత్యాయత్నం కేసులు, 3 గంజాయి అక్రమ రవాణా కేసులు ఉండగా.. మిగిలినవి దందాలకు సంబంధించిన కేసులుగా పోలీసులు వెల్లడించారు.

PIT NDPS యాక్ట్ కింద చర్యలు

గంజాయి అక్రమ రవాణాలో సుల్తాన్‌ ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతడిపై PIT NDPS Act–1988 కింద చర్యలు తీసుకోవాలని మదనపల్లి వన్‌టౌన్ పోలీసులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

పోలీసుల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా PIT NDPS యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పరారీలో ఉన్న సుల్తాన్ అరెస్ట్

నిర్బంధ ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో పరారీలో ఉన్న సుల్తాన్‌ను సోమవారం మదనపల్లి వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిబంధనల ప్రకారం అతడిని ఆరు నెలల నిర్బంధ కారాగార శిక్ష కోసం కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం

మదనపల్లి పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *