వికలాంగ చెల్లెలిపై కొడవలితో దాడి

కురబలకోట, ఆగస్టు 14: (gtvmedia)అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అడవికుంటపల్లిలో వికలాంగ మహిళపై దాడి ఘటన కలకలం రేపింది. వ్యవసాయ బోరు నీటి వినియోగం, భూమి వివాదం నేపథ్యంలో తన అన్న కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని బాధితురాలు అమరావతి (55) ఆరోపించింది.

అమరావతి తన భర్త శివయ్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గ్రామంలోని వ్యవసాయ బోరు నీటిని అమరావతి, ఆమె అన్న రాజన్న ఉమ్మడిగా వినియోగించుకుంటున్నట్లు తెలిపింది.

ఆవుల మేత కోసం సాగు చేసిన గడ్డికి నీరు పెట్టే విషయంలో తాజాగా వివాదం తలెత్తినట్లు బాధితురాలు పేర్కొంది. రాజన్న తన పొలానికి నీరు పారించుకున్న అనంతరం ఫ్యూజ్ క్యారియర్ తీసుకెళ్లడంతో గడ్డి ఎండిపోతుందని తాను ప్రశ్నించినట్లు తెలిపింది.

ఈ విషయంపై వివాదం జరగగా, రాజన్న కుటుంబ సభ్యులు చంద్రమ్మ, గంగులయ్య తనపై కొడవలి, రాయితో దాడి చేశారని అమరావతి ఆరోపించింది. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

“నేను వికలాంగురాలిని. అయినా నాపై కనికరం లేకుండా దాడి చేశారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. పోలీసులు నాకు రక్షణ కల్పించి, నిందితులపై చర్యలు తీసుకోవాలి” అని బాధితురాలు వేడుకుంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోపణలపై విచారణ అనంతరం వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *