మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలో ముందస్తు ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మిషన్ కాంపౌండ్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, హిజ్రా సంఘాల ప్రతినిధులు, రేషన్ షాప్ డీలర్లు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కళాకారులు, స్వర్ణకారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మాజీ సైనికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, పెన్షనర్లు, హమాలీ, బిల్డింగ్ వర్కర్స్, లారీ, ఆటో, కార్ యూనియన్ల సభ్యులు, వెల్డింగ్ వర్కర్స్, టైలర్స్, యువజన సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. మదనపల్లి ఐక్యతను దేశానికి చాటి చెప్పేలా ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ నిలిచిందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు, మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
