ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి.. సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి
పీలేరు, ఆగస్టు 10: (gtvmedia)ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి ఆయన పీలేరు పోలీస్ స్టేషన్‌తో పాటు మదనపల్లి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును డీఐజీ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఐజీ సూచించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
పీలేరు పోలీస్ స్టేషన్ స్థల పరిశీలన
పీలేరు పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని డీఐజీ, ఎస్పీ పరిశీలించారు. ఆ స్థలాన్ని ప్రజలకు, పోలీసు శాఖకు ఉపయోగకరంగా ఉండే విధంగా వినియోగించుకునే అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సాంకేతికతతో దర్యాప్తు వేగవంతం చేయాలి
అనంతరం మదనపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరును డీఐజీ పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, దర్యాప్తు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచే విధంగా సేవలు అందించాలని డీఐజీ సూచించారు.
ఈ పర్యటనలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌తో పాటు పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
