మదనపల్లె, ఆగస్టు 8: (gtvmedia)రాయచోటి పట్టణ పోలీసులు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి కేవలం 20 నిమిషాల్లో రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రాయచోటికి చెందిన షేక్ మెహరాజ్ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను పొరపాటున ఆటోలోనే మరిచిపోయారు. బ్యాగులో సుమారు 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆభరణాల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న రాయచోటి పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ ఆటోను గుర్తించారు. అనంతరం కేవలం 20 నిమిషాల్లోనే ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన ఆభరణాలను ఇన్స్పెక్టర్ బి.వి. చలపతి, ఎస్ఐ విష్ణువర్ధన్ బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా స్పందించి ఆభరణాలను రికవరీ చేసిన రాయచోటి పట్టణ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.
సాంకేతికతతో వేగవంతమైన పోలీసింగ్‌కు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
