పత్రికా ప్రకటన

బళ్లారి రాఘవ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంజాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు యువత ముందుకు రావాలి
…… డిఆర్ఓ వెంకటేశు

మదనపల్లె, ఆగస్టు 2:

తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన మానవతా కళాప్రపూర్ణుడు బళ్లారి రాఘవ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు.

ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో యువజన సర్వీసుల శాఖ, స్టెప్ , జిల్లా పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 146వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ వెంకటేశు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, నాటక రంగానికి ఎనలేని సేవలు అందించిన బళ్లారి రాఘవ ఆదర్శప్రాయ వ్యక్తి అని అన్నారు. ఆయన అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్యులు అని, 1880లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారని తెలిపారు. బాల్యం, విద్యాభ్యాసం బళ్లారిలో సాగిందని, చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారని చెప్పారు.న్యాయవాదిగా ప్రజాసేవ చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు “రావు బహదూర్” బిరుదు ప్రదానం చేసిందని పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసు నుంచే నాటకాలలో నటిస్తూ, బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్‌ను స్థాపించి ఆంగ్ల నాటకాలను ప్రదర్శించారని తెలిపారు.

సామాజిక నాటకాలకు ప్రాధాన్యత ఇచ్చి సమాజంలోని అసమానతలు, సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం కల్పించారని, మహిళలను కూడా నాటక రంగంలోకి ప్రోత్సహించారని చెప్పారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, శ్రీలంక తదితర దేశాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
1936లో సినిమా రంగంలోకి ప్రవేశించి సామాజిక మార్పులకు దోహదపడే చిత్రాల్లో నటించారని తెలిపారు. దళితుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసి, కులవివక్షను వ్యతిరేకిస్తూ సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని కొనియాడారు. మరుగున పడిన కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.

డీఆర్ఓ వెంకటేశు మాట్లాడుతూ… ఒకప్పుడు సామాజిక చైతన్యం, సంస్కరణలకు నాటకాలు, ముఖ్యంగా వీధి నాటకాలు ప్రభావవంతమైన మాధ్యమంగా నిలిచాయని తెలిపారు. బళ్లారి రాఘవ తన అసాధారణ నటనా ప్రతిభతో తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. నాటక కళను కేవలం వినోద సాధనంగా కాకుండా సామాజిక చైతన్యానికి శక్తివంతమైన సాధనంగా మలిచారని అన్నారు.బళ్లారి రాఘవ మరణించి దశాబ్దాలు గడిచినా ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. తెలుగు పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్రకు స్థానం కల్పించడం ద్వారా విద్యార్థులకు ఆయన సేవలు తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు.

మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేయడం ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అలవడుతాయని, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని బళ్లారి రాఘవతో పాటు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలని సూచించారు.మహనీయుల త్యాగాలు, సేవలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతులను అధికారికంగా నిర్వహిస్తోందని, యువత వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, యువజన సర్వీసుల శాఖ పర్యవేక్షణ అధికారి వి.వి. నారాయణ, పర్యాటక శాఖ సిబ్బంది చంద్ర, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులు వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
———–///—————
ఏపీఆర్ఓ, అన్నమయ్య జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *