నిందితుడికి యావజీవ జీవిత ఖైదు.
చిత్తూరు పోక్సో ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పు..
మదనపల్లె, అక్టోబర్ 23: అన్నమయ్య జిల్లా, కె.వి.పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి ఒడిగట్టి, అత్యంత పాశవికంగా హతమార్చిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అరుణ సారిక కఠిన శిక్ష ఖరారు చేశారు. నిందితుడు తన జీవితాంతం జైలులోనే గడిపేలా చారిత్రాత్మక తీర్పు వెలువరించారు.
12-10-2021న కె.వి.పల్లి మండలం, చీనేపల్లె పంచాయతీ ఎగువ మేకలవారిపల్లెకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి మేనమామ మేకల వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బాలకృష్ణ ‘బాయ్ మిస్సింగ్’ కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ముమ్మరంగా గాలించగా, మేకలవారిపల్లికి దక్షిణాన ఉన్న బొప్పాయి తోటలో బాలుడు శవమై కనిపించాడు. అదే గ్రామానికి చెందిన కాకులారం నందకుమార్ రెడ్డి అలియాస్ ఉదయ్ (20) అనే యువకుడు బాలుడిని మాయమాటలతో తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో మెడలోని టవల్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో కేసును హత్య (302 IPC), నేరం (377 IPC), ఆధారాల ధ్వంసం (201 IPC), పోక్సో చట్టం 5(m) r/w 6 కిందకు మార్చారు.
అప్పటి డీఎస్పీ రవి మనోహరాచారి, అప్పటి సీఐ కె. నాగార్జున రెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి, వేగంగా శవ పంచనామా నిర్వహించి కీలకమైన శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించారు. నేరం జరిగిన సరిగ్గా నెల రోజుల్లోనే (12-11-2021న) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విధించిన శిక్షలు
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. మోహన కుమారి కోర్టులో బలమైన ఆధారాలతో వాదనలు వినిపించడంతో నేరం రుజువైంది.
పోక్సో చట్టం సెక్షన్ 5 r/w 6 కింద: నిందితుడికి చనిపోయేంతవరకు కఠిన కారాగార శిక్ష మరియు ₹5,000/- జరిమానా.
IPC సెక్షన్ 302 (హత్య) కింద: జీవిత ఖైదు మరియు ₹5,000/- జరిమానా.
IPC సెక్షన్ 201 (ఆధారాల ధ్వంసం) కింద: 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ₹3,000/- జరిమానా విధించారు.
