పత్రికా ప్రకటన

ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పెంపుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ శాఖల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం.

మదనపల్లె, జూలై 29: (gtvmedia)
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ శాఖలైన పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్య, ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ తదితర శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
పాఠశాల విద్య శాఖపై సమీక్షిస్తూ…ప్రస్తుతం రాష్ట్రంలో 9వ స్థానంలో ఉన్న ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని మెరుగుపరచి జిల్లాను తొలి మూడు స్థానాల్లో నిలిపేలా సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రస్తుతం ఉన్న 80 శాతం నుంచి వంద శాతానికి పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌లో LEAP యాప్‌ను డౌన్‌లోడ్ చేయించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, UDISEలో నమోదు కాని పాఠశాల వెలుపల ఉన్న పిల్లల వివరాలను వెంటనే సేకరించి సంబంధిత యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి దాతల సహకారంతో తక్కువ వ్యయంతో వెదురు (బాంబూ) కాంపౌండ్ ఫెన్సింగ్ పైలట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
పాఠశాల నిర్వహణ కమిటీల (SMC) ఖాతాల్లో ఉన్న నిధుల వినియోగంపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సమగ్ర శిక్ష సహాయ ఇంజనీర్‌ను ఆదేశించారు. ప్రధాన మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుదీకరణ తదితర మౌలిక వసతుల పనులను 15 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

జీఎఫ్‌ఎల్‌ఎన్ (GFLN) కార్యక్రమం కింద నిర్వహించే బేస్‌లైన్ అంచనాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.

“మై స్కూల్ – మై ప్రైడ్” కార్యక్రమంలో ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టును మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా బోధిస్తున్న ఉపాధ్యాయుల విద్యార్థుల పనితీరు బలహీనంగా ఉంటే సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులను బాధ్యులుగా పరిగణించాలని తెలిపారు.

కేజీబీవీ జూనియర్ కళాశాలలు, పీఎం శ్రీ పాఠశాలల సివిల్ పనులను ఆగస్టు నెలాఖరులోగా, పీఎం శ్రీ ఫేజ్–VII కింద చేపట్టిన పనులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షిస్తూ..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదు (Enrollment) పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. హోమ్ పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన మెరుగుదల చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి, ముఖ్యంగా సి కేటగిరీలో ఉన్న విద్యార్థులను మెరుగైన ప్రతిభ కనబరిచేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉన్నత కేటగిరీలకు తీసుకురావాలని సూచించారు.

సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్షిస్తూ..
ప్రభుత్వ హాస్టళ్లలో తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. హాస్టల్ ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారాన్ని సంబంధిత వార్డెన్, ప్రిన్సిపాల్ తప్పనిసరిగా రుచి చూసి నాణ్యతను నిర్ధారించిన తర్వాతే వడ్డించాలని స్పష్టం చేశారు.

జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు అన్ని శిక్షణా కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఈఓ సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అనురాధ, ఇంటర్మీడియట్ జిల్లా కోఆర్డినేటర్ రవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి దాసరి నాగార్జున,ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————////—————-
డిఐపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *